

అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ టెక్ సంస్థ ఆడోబ్ సీఈవో పదవి నుంచి శాంతనూ నారాయణ్ త్వరలో తప్పుకోనున్నారు. 2007 డిసెంబర్లో సీఈవోగా బాధ్యతలు చేపట్టిన ఆయన దాదాపు 18 సంవత్సరాల పాటు సంస్థకు నాయకత్వం వహించారు. కొత్త సీఈవో నియామకం జరిగే వరకు ఆయన తన బాధ్యతలను కొనసాగిస్తారు. అనంతరం కొత్త సీఈవోకు బాధ్యతలు అప్పగించి, శాంతనూ ఆ పదవి నుంచి తప్పుకోనున్నారు. అయితే, ఆయన బోర్డ్ ఛైర్మన్గా కొనసాగుతూ సంస్థతో అనుబంధాన్ని కొనసాగిస్తానని ఉద్యోగులకు రాసిన లేఖలో తెలిపారు.
శాంతనూ నాయకత్వంలో ఆడోబ్ సంస్థ గణనీయమైన వృద్ధిని సాధించింది. ఒకప్పుడు సుమారు 3,000 మంది ఉద్యోగులతో ఉన్న సంస్థను 30,000 మందికి పైగా ఉద్యోగులతో ఉన్న గ్లోబల్ టెక్ దిగ్గజంగా తీర్చిదిద్దారు. అలాగే కంపెనీ విలువను భారీగా పెంచడంలో కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఆయనను “లెజెండ్”గా అభివర్ణిస్తూ ప్రశంసలు కురిపించారు. భారతదేశంలో జన్మించిన శాంతనూ నారాయణ్ ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసి, అనంతరం అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!