

తెలంగాణలో హింసకు స్థానం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇంకా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. మావోయిస్టుల అగ్రనేత గణపతి లొంగిపోతే ఆయన ఆరోగ్యం, రక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తెలిపారు. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో సీఎం సమక్షంలో 130 మంది మావోయిస్టులు 124 ఆయుధాలతో లొంగిపోవడం రాష్ట్ర చరిత్రలో అరుదైన ఘటనగా నిలిచింది.
లొంగిపోయిన వారికి ఆరోగ్య భద్రత కార్డులు, మెరుగైన వైద్యసేవలు, ఇందిరమ్మ ఇళ్లు వంటి సౌకర్యాలు కల్పిస్తామని సీఎం తెలిపారు. అవసరమైతే స్వగ్రామాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వ స్థలం కూడా అందిస్తామని చెప్పారు. అయితే తెలంగాణ గడ్డపై హింసను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని స్పష్టం చేశారు. లొంగిపోయిన మావోయిస్టులపై కేసుల ఎత్తివేత విషయంలో ఒక్కో కేసును పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!