

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి G.కిషన్ రెడ్డి కాళేశ్వరం అవినీతి విచారణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అవకతవకలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ అంశానికి సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ప్రభుత్వ వైఫల్యాన్ని మరోసారి బయటపెట్టిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ వాటిని చట్టపరంగా సమర్థంగా కోర్టు ముందు ప్రవేశపెట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. సరైన ఆధారాలు సమర్పించలేకపోవడం వల్ల కమిషన్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యల విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థతకు నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైందని, చేతల్లో చూపించలేకపోయిందని ఆయన ఎద్దేవా చేశారు.
అధికారంలోకి వస్తే కేసీఆర్ కుటుంబం, మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నేతలపై అవినీతి కేసులు కఠినంగా విచారిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఆయన గుర్తు చేశారు. కానీ రెండున్నరేళ్లు గడిచినా ఒక్క పెద్ద దర్యాప్తు కూడా జరగలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం, ఫార్ములా వన్ రేస్ ఖర్చులు, డ్రగ్స్ కేసు, భూ ఆక్రమణలు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాల్లో అవినీతి జరిగిందని సీఎం స్వయంగా చెప్పినప్పటికీ చర్యలు ఎందుకు లేవని నిలదీశారు. రాజకీయ దోస్తీ కారణంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు.



.png&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!