

ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత, హార్ముజ్ జలసంధిని దాటి భారత్ జెండాతో ప్రయాణిస్తున్న జగ్ విక్రమ్ నౌక ఇప్పుడు దేశం వైపు విజయవంతంగా సాగుతోంది. ప్రస్తుతం ఇది గల్ఫ్ ఆఫ్ ఒమన్ సమీపంలో ఉండగా, భారత్ దిశగా వేగంగా కదులుతోంది. ఈ నౌక ఎల్పీజీ సరుకుతో వస్తుండటం వల్ల దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇది కేవలం ఒక నౌక ప్రయాణం మాత్రమే కాకుండా, దేశ ఇంధన భద్రతకు కీలక సూచికగా భావిస్తున్నారు. కాల్పుల విరమణ తర్వాత హార్ముజ్ జలసంధిని దాటిన భారత నౌకల్లో ఇది ఒకటిగా గుర్తిస్తున్నారు. ఇప్పటికే తొమ్మిది నౌకలు ఈ మార్గాన్ని దాటి భారత్ చేరుకున్నాయి. ఇంకా సుమారు 15 భారత జెండా నౌకలు పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో వేచి ఉన్నాయి.
జగ్ విక్రమ్ నౌక ముంబై కేంద్రంగా పనిచేస్తున్న గ్రేట్ ఈస్ట్రన్ షిప్పింగ్ కంపెనీకు చెందినది. ఈ మధ్యతరహా నౌకకు సుమారు 26 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉంది. ప్రస్తుతం దాదాపు 20 వేల టన్నుల ఎల్పీజీని భారత్‌కు తీసుకువస్తోంది. దేశ గ్యాస్ అవసరాలను తీర్చడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది.
మెరైన్ ట్రాఫిక్ సమాచారం ప్రకారం, పర్షియన్ గల్ఫ్‌లో ఇంకా వందల సంఖ్యలో నౌకలు నిలిచిపోయాయి. అందులో 426 ట్యాంకర్లు, 34 ఎల్పీజీ క్యారియర్లు, 19 ఎల్‌ఎన్‌జీ నౌకలు ఉన్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!