

మెమొరీ చిప్స్ (ర్యామ్) ధరలు ఇప్పటికే పెరగడంతో టీవీ తయారీ పరిశ్రమపై ఒత్తిడి పెరుగుతోంది. పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో ప్లాస్టిక్ ధరల నుంచి సముద్ర రవాణా ఖర్చుల వరకు అన్ని వ్యయాలు పెరిగాయి. దీంతో టీవీ తయారీ ఖర్చులు అధికమవడంతో కంపెనీలు ధరలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రభావంతో టీవీ విక్రయాలు తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పెరుగుతున్న ధరల కారణంగా వినియోగదారులు పెద్ద స్క్రీన్ టీవీలకు బదులుగా చిన్న సైజుల వైపు మొగ్గుచూపుతున్న ‘డౌన్ట్రేడింగ్’ ధోరణి కనిపిస్తోంది. రూపాయి విలువ పడిపోవడం కూడా ఉత్పత్తి వ్యయాలను మరింత పెంచింది. అయితే మార్కెట్ వాటాను కాపాడుకోవడానికి కొన్ని పెద్ద బ్రాండ్లు ఈ అదనపు ఖర్చులను వినియోగదారులపై మోపకుండా తాము భరిస్తున్నాయి. అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా అత్యవసరం కాని కొనుగోళ్లను వినియోగదారులు వాయిదా వేస్తుండగా, టీవీలు కూడా అందులో భాగంగా ఉన్నాయి. అయినప్పటికీ, ఈ ఏడాది ద్వితీయార్థంలో పండగల సీజన్లో మార్కెట్ మళ్లీ పుంజుకునే అవకాశముందని కంపెనీలు భావిస్తున్నాయి.
థామ్సన్, కొడాక్, బ్లౌపంక్ట్ బ్రాండ్ల లైసెన్సీ అయిన ఎస్పీపీఎల్ సీఈఓ అవనీత్ సింగ్ మాట్లాడుతూ, ధరల పెరుగుదల కారణంగా వినియోగదారులు పెద్ద సైజుల టీవీలను వదిలి చిన్న సైజులకే పరిమితమవుతున్నారని తెలిపారు. గత ఆరు నెలల్లో ధరలు గణనీయంగా పెరిగాయని, రూ.9000కి లభించిన 32 అంగుళాల టీవీ ఇప్పుడు రూ.11,000కి చేరిందని చెప్పారు. ఇదే సమయంలో, ఆకర్షణీయమైన ఈఎంఐ సదుపాయాలు పెద్ద స్క్రీన్ టీవీల డిమాండ్‌ను కొంతవరకు నిలబెడుతున్నాయని హైయర్ ఇండియా అధ్యక్షుడు ఎన్ఎస్ సతీశ్ వెల్లడించారు. మార్కెట్ అంచనాల ప్రకారం, 2026 తొలి త్రైమాసికంలో టీవీ సరఫరాలు 5-6 శాతం, రెండో త్రైమాసికంలో 3-5 శాతం తగ్గే అవకాశం ఉంది. అయితే స్వంతంగా విడిభాగాలను తయారుచేసుకునే బ్రాండ్లు ఈ పరిస్థితిని మెరుగ్గా ఎదుర్కోగలవని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రీమియం విభాగం మాత్రం స్థిరంగా ఉండి, పండగల సీజన్లో కొంత రికవరీ సాధించే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!