

నూతన ఆర్థిక సంవత్సరం (2026–27)కి సంబంధించిన తొలి ద్రవ్య పరపతి విధానంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును యథాతథంగా కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉండటంతో ఆర్బీఐ ప్రస్తుతం ‘వేచి చూసే’ ధోరణి అవలంబించవచ్చని వారు చెబుతున్నారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ ప్రభావంతో కమోడిటీ ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటుండగా, రూపాయి చారిత్రక కనిష్ఠ స్థాయిల్లో కొనసాగుతోంది. ద్రవ్యోల్బణం పెరగడం, వృద్ధి రేటు మందగించే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో రెపో రేటులో మార్పులు చేయకుండా కొనసాగించే అవకాశాలు ఉన్నాయని సర్వేలో వెల్లడైంది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ సమావేశం నిర్వహించి దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులను సమీక్షించిన అనంతరం కీలక నిర్ణయం ప్రకటించనుంది.
ఇదిలా ఉండగా, పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడనుందని రేటింగ్ సంస్థ మూడీస్ హెచ్చరించింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి అంచనాలను 6.8 శాతం నుంచి 6 శాతానికి తగ్గించింది. ముడి చమురు, ఎల్పీజీ, ఎరువుల సరఫరాలో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని, దీనివల్ల రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల కొరత తలెత్తవచ్చని పేర్కొంది. ద్రవ్యోల్బణం 2.4 శాతం నుంచి 4.8 శాతానికి పెరిగే అవకాశముందని అంచనా వేస్తూ, ఇన్పుట్ ఖర్చుల పెరుగుదల, ప్రైవేట్ వినియోగం మందగించడం, పరిశ్రమల కార్యకలాపాలు తగ్గడం, పెట్టుబడుల వేగం తగ్గడం వంటి అంశాలు వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతాయని వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!