

గ్రామ సభలపై రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సభలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సభల్లో అధికారులు ముఖ్యమంత్రి గారి సందేశాన్ని చదివి వినిపిస్తారని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి రెండు సంవత్సరాల మూడు నెలలు పూర్తయ్యాయని, ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ గత పాలకుల తప్పిదాలను సరిచేస్తూ సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీపడకుండా ప్రభుత్వం పని చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. తాము పాలకులం కాదని, సేవకులం అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు, అవసరాలను కేంద్రంగా పెట్టుకుని పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో ఉంచుతున్నామని పేర్కొన్నారు. ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రజలు ప్రజా పాలనకు తమ ఆమోదం, మద్దతు ప్రకటించారని, ఆ ఫలితాలు ప్రభుత్వ బాధ్యతను మరింత పెంచాయని చెప్పారు.
ప్రభుత్వ పథకాలు కేవలం కాగితాలపై కాకుండా ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకురావాలన్నదే తమ సంకల్పమని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ఉద్దేశంతోనే “ప్రజాపాలన – ప్రగతిప్రణాళిక” కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. మార్చి 6 నుండి 99 రోజుల పాటు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగాలని సూచించారు. ఊరు వాడ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి అధికారి పని చేయాలని, ఫైళ్లను వేగంగా క్లియర్ చేయడం, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలని ఆయన పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్ళు, మహిళా సాధికారత వంటి పథకాలు అర్హులకు చేరేలా ఈ కార్యక్రమం కొనసాగాలని సూచించారు.
“తెలంగాణ రైజింగ్ – 2047” విజన్‌తో రాష్ట్రాన్ని ఆర్థికంగానే కాక అన్ని రంగాల్లో ప్రపంచంలో నంబర్ వన్‌గా నిలపాలన్నదే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ సంకల్పంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని కోరారు. రాష్ట్రాన్ని CURE, PURE, RAREగా వర్గీకరించుకున్నామని, వాటి పరిధిలో సేవా, తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలని తెలిపారు. ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధారణ కార్యక్రమం కాదని, ఇది ఒక దీక్ష అని పేర్కొన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఒక్కటై దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలని, అదే తన కల అని చెప్పారు. ఆ కలను సాకారం చేయడంలో ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. అందరి సహకారం కోరుతూ ఈ లేఖను ముగించారు.



.avif&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!