

దేశీయంగా 50,000 మంది వృత్తి నిపుణులను నియమించుకునే ప్రక్రియ కొనసాగుతోందని, సిబ్బందిలో సంక్లిష్ట సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని పెంచేందుకు ‘క్రిటికల్ థింకింగ్’ మరియు విశ్లేషణ నైపుణ్యాల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నామని కన్సల్టింగ్ దిగ్గజ సంస్థ డెలాయిట్ దక్షిణాసియా సీఈఓ నితిన్ తెలిపారు. కృత్రిమ మేధ (ఏఐ) వల్ల భారీ స్థాయిలో ఉద్యోగ కోతలు జరుగుతాయన్న ఆందోళనలు వాస్తవానికి దూరమని ఆయన స్పష్టం చేశారు. దేశంలో క్వాంటమ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను స్థాపించేందుకు కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
ఏఐ కారణంగా ఉద్యోగాలు తగ్గుతాయనే అభిప్రాయాన్ని డెలాయిట్ సమర్థించదని, ఉద్యోగుల పనితీరును మెరుగుపరచడం కోసం మాత్రమే ఈ సాంకేతికతను వినియోగిస్తామని ఆయన చెప్పారు. ఇప్పటికే 30,000 మంది ఉద్యోగులకు ఏఐ శిక్షణ అందించామని, మరో 20,000 మందికి కూడా ఇలాంటి నైపుణ్యాలను అందించేందుకు చర్యలు చేపడుతున్నామని వివరించారు. అంతర్జాతీయంగా డెలాయిట్ సంస్థలో పనిచేస్తున్న సిబ్బందిలో మూడోవంతు మంది భారత్‌లోనే ఉన్నారని ఆయన తెలిపారు.
సంస్థ మొత్తం ఆదాయంలో సుమారు 9 శాతం సిబ్బంది సామర్థ్య పెంపు కోసం ఖర్చు చేస్తున్నామని నితిన్ పేర్కొన్నారు. భారత ప్రభుత్వ రంగ సంస్థలు ఏఐను అమలు చేయడంలో డేటా భద్రత, అధిక వ్యయం వంటి సవాళ్లు ఎదుర్కొంటున్నాయని అన్నారు. సైబర్ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, “అధిక వేగంతో నడిచే కారుకు ఎంత శక్తివంతమైన ఇంజిన్ అవసరమో, అంతే స్థాయిలో భద్రత కలిగించే బ్రేకులు కూడా అవసరం” అని ఉపమానంగా చెప్పారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!