

ఆంధ్రప్రదేశ్ నాయకులు అమరావతి రాజధాని అంశంపై జరుగుతున్న చర్చను మళ్లీ ప్రస్తావించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్లు అయినా ఇప్పటికీ రాజధాని కోసం పోరాటం జరుగుతోందని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించలేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వేర్వేరు అన్న భావన తమకు ఎప్పుడూ లేదని, తెలుగు నేల అన్న భావన మాత్రమే ఉందని అన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు సరైన కార్యాలయాలు లేవని, అయినా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కష్ట పరిస్థితుల్లో కూడా బలంగా పనిచేశారని తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం అమరావతిపై కుట్రలకు పాల్పడిందని ఆరోపించారు. గతంలో అమరావతిని రాజధానిగా మద్దతిచ్చిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారని తెలిపారు. రైతులు 58 రోజుల్లో 34 వేల ఎకరాల భూమి ఇచ్చారని, అయినా అమరావతికి నిధులు ఇవ్వవద్దని ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాశారని పేర్కొన్నారు.
ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. అమరావతిని శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పించేందుకు సభలో తీర్మానం ఆమోదించారు. ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!