

హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, కాలుష్య సమస్యలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజారవాణాను ప్రోత్సహించడానికి భాగంగా ఎంఎంటీఎస్ హైదరాబాద్ రైళ్లలో మహిళలు, పురుషులు అందరికీ ఉచిత ప్రయాణం అందించే పథకాన్ని అమలు చేయాలని యోచిస్తోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ విషయంపై రాష్ట్ర ఉన్నతాధికారులు దక్షిణ మధ్య రైల్వే అధికారులతో సమావేశమై చర్చించారు. ఒక సంవత్సరం పాటు ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేసి, ఫలితాలను బట్టి కొనసాగింపుపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రస్తుతం ఎంఎంటీఎస్ రైళ్ల ద్వారా సంవత్సరానికి సుమారు రూ.10 కోట్ల ఆదాయం వస్తున్నట్లు అంచనా. ఉచిత ప్రయాణం అమలులోకి వచ్చిన తర్వాత ప్రయాణికుల సంఖ్య పెరిగినా, ప్రస్తుత ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తుందని స్పష్టం చేసింది. కొవిడ్‌కు ముందు రోజుకు సుమారు 1.2 లక్షల మంది ప్రయాణికులు 121 రైళ్లలో ప్రయాణించేవారు. ప్రస్తుతం 80 నుంచి 88 రైళ్లు మాత్రమే నడుస్తుండగా, ప్రయాణికుల సంఖ్య 38 వేల నుంచి 42 వేల మధ్యలో ఉంది. రైళ్ల సమయపాలన లోపాలు, తక్కువ ఫ్రీక్వెన్సీ కారణంగా ప్రయాణికుల ఆదరణ తగ్గినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, రద్దీ సమయాల్లో రైళ్ల సంఖ్య పెంచడం, సమయపాలన మెరుగుపరచడం, స్టేషన్లలో సౌకర్యాలు అభివృద్ధి చేయడం వంటి సూచనలు ప్రభుత్వం చేసింది. అదనంగా, ప్రయాణికులు ఇంటి నుంచి స్టేషన్ వరకు సులభంగా చేరేందుకు ఆర్టీసీ షటిల్ బస్సులు నడపాలని యోచిస్తోంది. దీనిపై స్పందించిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు, ఉచిత ప్రయాణ పథకానికి సంబంధించిన ముసాయిదా ఒప్పందం (ఎంవోయూ) పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రైల్వే బోర్డు అనుమతితో తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు. రైళ్ల సంఖ్య, టైమింగ్‌లను రైల్వే నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. అలాగే ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.491.45 కోట్ల బకాయిలను చెల్లించాలని రైల్వే శాఖ కోరింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!