

ఐసీఐసీఐ బ్యాంక్ 2025-26 ఆర్థిక సంవత్సరంలోని జనవరి–మార్చి త్రైమాసికంలో బలమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. ఈ కాలంలో ఏకీకృత నికర లాభం రూ.14,755 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.13,502 కోట్లతో పోలిస్తే ఇది 9.28% వృద్ధి. స్టాండలోన్ ప్రాతిపదికన నికర లాభం రూ.12,630 కోట్ల నుంచి 8.5% పెరిగి రూ.13,702 కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి మొత్తం నికర లాభం రూ.50,147 కోట్లుగా నమోదై, గత సంవత్సరం రూ.47,227 కోట్లతో పోలిస్తే 6.2% పెరిగింది.
సమీక్షా త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం (NII) 8.4% పెరిగి రూ.22,979 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ (NIM) 4.32%గా నమోదైంది. వడ్డీేతర ఆదాయం (ట్రెజరీ మినహా) 5.6% పెరిగి రూ.7,415 కోట్లకు చేరింది. అయితే ట్రెజరీ విభాగంలో రూ.106 కోట్ల నష్టం నమోదైంది. నిర్వహణ వ్యయాలు 12% పెరిగి రూ.12,089 కోట్లకు చేరాయి. ఆస్తుల నాణ్యతలో మెరుగుదల కనిపించింది. స్థూల ఎన్‌పీఏలు 1.53% నుంచి 1.4%కు తగ్గాయి. గత త్రైమాసికంలో ఇవి 1.67%గా ఉన్నాయి. స్థూల మొండి బకాయిలు రూ.4,242 కోట్లుగా నమోదయ్యాయి. కేటాయింపులు కూడా గణనీయంగా తగ్గి రూ.891 కోట్ల నుంచి రూ.96.16 కోట్లకు చేరాయి.
దేశీయ కార్పొరేట్ రుణాలు 9%కు పైగా పెరిగినప్పటికీ, మొత్తం రుణాల్లో వాటా 20%కు పరిమితమైంది. 2026 మార్చి 31 నాటికి బ్యాంక్ మూలధన సమృద్ధి నిష్పత్తి 17.18%గా ఉంది. ప్రధాన బఫర్ 16.35%గా నమోదైంది. ఒక్కో షేర్‌కు రూ.12 చొప్పున తుది డివిడెండ్ చెల్లించేందుకు బోర్డు ఆమోదం తెలిపినట్లు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సందీప్ బత్రా వెల్లడించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!