

భారతీయ సినీ రంగంలో తనదైన రికార్డులతో ప్రత్యేక స్థానం సంపాదించిన రజనీకాంత్, ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ రూపొందిస్తున్న జైలర్ 2 పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కోలీవుడ్‌లోనే మొదటి 1000 కోట్ల వసూళ్లు సాధించే సినిమాగా నిలుస్తుందనే చర్చలు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. సినిమా విడుదలకు ముందే వ్యాపారపరంగా రికార్డులు సృష్టిస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్ర డిజిటల్ హక్కుల కోసం భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు సమాచారం. సుమారు రూ.160 కోట్లకు ఈ డీల్ జరిగినట్లు ప్రచారం ఉంది. మొదటి భాగం జైలర్ కు వచ్చిన డీల్‌తో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల కావడం విశేషం.
మొదటి భాగంలో అతిథి పాత్రలతో ఆకట్టుకున్న మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్లు సీక్వెల్‌లో కూడా కనిపించనున్నారని సమాచారం. అదనంగా ఎస్.జె. సూర్య విలన్ పాత్రలో నటిస్తున్నారని టాక్ ఉంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక పాత్రలో కనిపించే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు. ముంబై, గోవా, కేరళలో షూటింగ్ పూర్తయి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. సన్ పిక్చర్స్ ఈ సినిమాను 2026 ఆగస్టు మధ్యలో, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మొత్తంగా జైలర్ 2 తో రజనీకాంత్ మరోసారి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటారనే అంచనాలు ఉన్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!