

తెలంగాణ హైకోర్టు జగతి పబ్లికేషన్స్ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను తిరస్కరించింది. విదేశీ ఖాతాలకు నిధులు బదిలీ చేయడం, కొత్త బ్యాంకు ఖాతాలు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ జగతి పబ్లికేషన్స్ ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ మాజీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులతో సంబంధం ఉన్న బ్యాంకు ఖాతాల నేపథ్యంలో ఈ విజ్ఞప్తి వచ్చింది. ఫిబ్రవరిలో వాదనలు విన్న జస్టిస్ తిరుమలాదేవి నిన్న తీర్పు వెలువరించారు.
పిటిషనర్ తరఫున న్యాయవాది వాదిస్తూ, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా విధించిన షరతుల కారణంగా దుబాయ్ ఖాతాలకు న్యూస్ ప్రింట్ కొనుగోళ్ల కోసం నిధుల బదిలీకి ఎస్‌బీఐ నిరాకరిస్తోందన్నారు. దీంతో వ్యాపార కార్యకలాపాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. బంజారాహిల్స్ ఎస్‌బీఐ బ్రాంచ్ ద్వారా నిధుల బదిలీకి అనుమతించాలన్నా, లేదా ఇతర బ్యాంకుల్లో ఖాతాలు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలన్నా కోర్టును కోరారు. అయితే సీబీఐ తరఫు న్యాయవాది దీనికి వ్యతిరేకంగా వాదిస్తూ, ఒకే పిటిషన్‌లో పలు ఉపశమనాలు కోరారని, అవసరమైన బ్యాంకులను ప్రతివాదులుగా చేర్చలేదన్నారు.
ఇప్పటికే కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం కొన్ని ఖాతాలను మాత్రమే పరిమితంగా వినియోగించుకునే అవకాశం ఉందని, కొత్త ఖాతాలు ప్రారంభించడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది. సీబీఐ కోర్టులో కేసు విచారణ పూర్తయ్యే వరకు ఇదే అమల్లో ఉంటుందని తెలిపింది. ప్రధాన పిటిషన్, మధ్యంతర పిటిషన్‌ల మధ్య పొంతన లేదని గమనించిన న్యాయమూర్తి, ఏవైనా మార్పులు అవసరమైతే సీబీఐ కోర్టును ఆశ్రయించాలని సూచిస్తూ ఈ పిటిషన్‌ను కొట్టివేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!