

సింగరేణి యాజమాన్యం తీసుకున్న ప్రత్యేక చొరవతో యూనియన్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కోటి రూపాయల ప్రమాద భీమా పథకాన్ని అమలు చేస్తున్న యూనియన్ బ్యాంక్, ఇకపై సహజ మరణం చెందిన సింగరేణి కార్మికులు మరియు అధికారులకు కూడా ఉచిత భీమా సౌకర్యం కల్పించనుంది. కార్పొరేట్ శాలరీ అకౌంట్ కలిగిన ఉద్యోగి లేదా అధికారి మరణించిన సందర్భంలో వారికి రూ.10 లక్షల భీమా ప్రయోజనం వర్తించనుంది. ఈ విషయాన్ని బ్యాంక్ యాజమాన్యం సింగరేణి సంస్థకు అధికారికంగా తెలియజేసింది.
సింగరేణి ఛైర్మన్ మరియు ఎండీ డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ మార్గదర్శకత్వంలో, డైరెక్టర్ పర్సనల్ మరియు ఫైనాన్స్ గౌతమ్ పోట్రు తీసుకున్న ప్రత్యేక చొరవతో ఈ నిర్ణయం సాధ్యమైంది. 2024లో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో యూనియన్ బ్యాంక్ సింగరేణి కార్మికులకు రూ.1 కోటి ప్రమాద భీమా పథకాన్ని అమలు చేసింది. ఇప్పుడు అదే ఒప్పందానికి కొనసాగింపుగా సహజ మరణానికి కూడా భీమా వర్తింపజేయాలని నిర్ణయించింది.
ఈ కొత్త భీమా పథకం ఈ నెల 1 నుండి అమలులోకివచ్చింది. సాధారణంగా ఇతర ఇన్సూరెన్స్ సంస్థల్లో రూ.10 లక్షల భీమా పాలసీ కోసం కనీసం రూ.5,000కు పైగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే సింగరేణి యాజమాన్యం చొరవతో యూనియన్ బ్యాంక్ ఈ సౌకర్యాన్ని పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. దీనిపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది. అలాగే సింగరేణిలో ప్రమాద భీమా అందిస్తున్న ఇతర బ్యాంకులు కూడా ఇదే తరహాలో సహజ మరణ భీమా సౌకర్యాన్ని అమలు చేయాలనే దిశగా సింగరేణి యాజమాన్యం ప్రయత్నాలు కొనసాగిస్తోంది.





.webp&w=3840&q=75)
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!