

టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్, సీనియర్ హీరో రాజశేఖర్ కలిసి నటించిన క్రేజీ యాక్షన్ డ్రామా ‘బైకర్’ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఏప్రిల్ 3న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుండటంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నటి, నిర్మాత జీవిత రాజశేఖర్ పాల్గొని రివ్యూయర్లపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఫిలిం నగర్‌లో చర్చనీయాంశంగా మారాయి.
‘బైకర్’ విజయోత్సవ సభలో జీవిత రాజశేఖర్ సినిమా రివ్యూల తీరుపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. సినిమాను విశ్లేషించే విధానంపై రివ్యూయర్లు అనుసరిస్తున్న ధోరణిని ఆమె తప్పుబట్టారు. “సినిమాలో సెంటిమెంట్ ఎక్కువగా ఉంటే మెలోడ్రామా అంటారు. అదే స్టైలిష్‌గా తీస్తే డెప్త్ లేదని అంటారు. అసలు ఏది నమ్మాలో అర్థం కావడం లేదు. సినిమా ఎలా తీయాలో రివ్యూయర్లనే అడగాలా అన్నట్టుగా ఉంది” అంటూ వ్యాఖ్యానించారు. ఒక సినిమా వెనుక వందలాది మంది కష్టం, కోట్లాది రూపాయల పెట్టుబడి ఉంటుందని గుర్తుచేసిన ఆమె, రివ్యూలపై ఆధారపడకుండా ప్రేక్షకులు స్వయంగా థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలని కోరారు.
అలాగే, తాను ‘బతుకు జట్కాబండి’ వంటి కార్యక్రమాలు చేసినప్పుడు అనేక నిజమైన భావోద్వేగాలను చూశానని పేర్కొన్న జీవిత, ‘బైకర్’ సినిమాలో శర్వానంద్, రాజశేఖర్ తమ నటనతో ఆ భావాలను అద్భుతంగా ప్రదర్శించారని ప్రశంసించారు. షూటింగ్ ప్రారంభం నుంచే యూనిట్‌తో కలిసి ప్రయాణించానని, దర్శకుడు అభిలాష్ రెడ్డి చేసిన కృషి తనకు తెలుసని తెలిపారు. అందుకే థియేటర్‌లో కనురెప్ప వేయకుండా సినిమాను ఆస్వాదించానని చెప్పారు. చివరగా, మనుషుల మధ్య మనస్పర్థలు ఉంటే వాటిని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని, అందరితో సానుకూలంగా ఉండటం జీవితంలో ముఖ్యమని సందేశం ఇచ్చారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!