

కోల్‌కతాపై విజయంతో ఉత్సాహంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు ఊహించని షాక్ తగిలింది. జట్టు రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ టోర్నీని మధ్యలోనే వీడి తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. వెన్నునొప్పి కారణంగా ఈ సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన కమిన్స్, గాయం నుంచి కోలుకున్న తర్వాత భారతదేశానికి వచ్చి నెట్స్‌లో ప్రాక్టీస్ కూడా ప్రారంభించాడు. అయితే, మైదానంలోకి తిరిగి రావడానికి క్రికెట్ ఆస్ట్రేలియా (CA) ఇంకా అనుమతి ఇవ్వలేదు.
ఈ నేపథ్యంలో తుది అనుమతి కోసం కమిన్స్ మళ్లీ ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు సమాచారం. క్రికెట్ ఆస్ట్రేలియా పర్యవేక్షణలో అతడికి స్కాన్ నిర్వహించనున్నారు. ఆ స్కాన్‌లో గాయం పూర్తిగా నయమైందని నివేదిక వస్తే, ఐపీఎల్‌లో ఆడేందుకు అనుమతి లభించే అవకాశం ఉంది. కమిన్స్ ఏప్రిల్ 17న తిరిగి జట్టుతో చేరే అవకాశముండటంతో, అతడు ఐపీఎల్ తొలి ఐదు మ్యాచ్‌లకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తాత్కాలిక కెప్టెన్‌గా భారత యువ బ్యాటర్ ఇషాన్ కిషాన్‌ను నియమించారు. ఇషాన్ నేతృత్వంలో సీజన్‌ను ఓటమితో ప్రారంభించిన ఎస్ఆర్‌హెచ్, తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో పరాజయం పాలైంది. అయితే, రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఘన విజయం సాధించి పుంజుకుంది. తదుపరి మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ పంత్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!