

హైదరాబాద్‌లో డిసెంబర్ 31 రాత్రి, జనవరి 1 నూతన సంవత్సర వేడుకల నిర్వహణపై పోలీసులు కఠిన నిబంధనలు విధించారు. స్టార్ హోటళ్లు, క్లబ్స్, బార్ అండ్ రెస్టారెంట్స్, పబ్‌ల నిర్వాహకులు వేడుకలకు కనీసం 15 రోజుల ముందే అనుమతి తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. వేడుకల సమయంలో శాంతిభద్రతలు భంగం కలగకుండా, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు నిబంధనల ప్రకారమే ఉండాలని సూచించారు.
వేడుకలు నిర్వహించే ప్రాంతాల్లో ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి చేయాలని, అతిథుల భద్రతతో పాటు ట్రాఫిక్ నిర్వహణకు ప్రత్యేక సిబ్బంది ఉండాలని తెలిపారు. అశ్లీల నృత్యాలు, అసభ్య ప్రవర్తనకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో లౌడ్స్పీకర్లు, డీజే సిస్టమ్‌లు రాత్రి 10 గంటలకే నిలిపివేయాలని, ఇండోర్‌లో అర్ధరాత్రి 1 గంట వరకు మాత్రమే 45 డెసిబెల్స్ శబ్ధ పరిమితిని పాటించాలని ఆదేశించారు. బాణసంచాకు పూర్తిగా నిషేధం విధించగా, సరైన పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. పబ్‌లు, బార్లలో మైనర్లకు ప్రవేశం నిషిద్ధమని, మత్తుపదార్థాల విక్రయం లేదా వినియోగంపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
వేడుకల అనంతరం కూడా భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని పోలీసులు తెలిపారు. పబ్, బార్ నిర్వాహకులు కస్టమర్లను సురక్షితంగా ఇంటికి చేరవేయడానికి క్యాబ్స్, డ్రైవర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడితే కేసు నమోదు చేసి వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తామని, కోర్టు రూ.10వేల జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్‌ను మూడు నెలలు లేదా పూర్తిగా సస్పెండ్ చేయవచ్చని చెప్పారు. మైనర్లు వాహనం నడిపి పట్టుబడినా లేదా ప్రమాదానికి గురైనా వాహన యజమానిదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేశారు. నగరవ్యాప్తంగా షీటీమ్స్ నిఘా ఉంటుందని, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!