

ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో జరిగిన అవకతవకలకు బాధ్యులైన వారికి హైకోర్టు ఎలాంటి క్లీన్ చిట్ ఇవ్వలేదని తెలిపారు. కమిషన్ ఏర్పాటు చేసిన జీవోను రద్దు చేయాలన్న పిటిషన్‌ను కోర్టు తిరస్కరించిందని చెప్పారు. జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటును హైకోర్టు సమర్థించిందని, అయితే నోటీసుల విషయంలో సాంకేతిక లోపాల కారణంగా కమిషన్ సిఫార్సులు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయని వివరించారు. ఈ అంశంపై సీబీఐ విచారణకు ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసిందని తెలిపారు.
మేడిగడ్డ బ్యారేజీలోని పిల్లర్ కుంగిపోవడం నిజమని, డిజైన్, నిర్మాణం, నిర్వహణలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. సుమారు రూ.లక్ష కోట్ల ప్రాజెక్టులో గత రెండేళ్లుగా నీరు అందడం లేదని తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ ప్రాజెక్టు కారణంగా రూ.15 వేల నుంచి రూ.20 వేల కోట్ల వరకు వడ్డీలు, అప్పుల భారాన్ని ప్రభుత్వం మోస్తోందని చెప్పారు. మూడు బ్యారేజీల పునాదులపైనా అనుమానాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడినట్లు తెలిపారు. హైకోర్టు తీర్పును పూర్తిగా పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!