

కృష్ణా జిల్లాలోని పెనమలూరు పోలీసులకు పసిపిల్లలను అపహరించి సంతానం లేని దంపతులకు విక్రయిస్తున్న ముఠా పట్టుబడింది. అనుమానం రాకుండా ఉండేందుకు యాచకులు, వలస కూలీలు, సంచార జాతుల పిల్లలను లక్ష్యంగా చేసుకుని ఈ గ్యాంగ్ కిడ్నాప్‌లకు పాల్పడుతోంది. ఇటీవల విజయవాడ ఆటోనగర్‌లో భిక్షాటన చేసుకునే సుమమ్మకు చెందిన 10 నెలల శిశువును ఈ నెల 17న అపహరించి మచిలీపట్నంలోని దంపతులకు విక్రయించారు. ఈ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించి బాలుడిని రక్షించి తల్లికి అప్పగించారు. తదుపరి దర్యాప్తులో ఈ ముఠా మరో చిన్నారినీ కిడ్నాప్ చేసినట్లు వెల్లడైంది.
గత నెలలో కనకదుర్గమ్మ ఆలయం సమీపంలో ఒడిశా నుంచి వచ్చిన ఓ మహిళ కుమారుడు శివంను అపహరించారు. అనంతరం వన్‌టౌన్ ప్రాంతంలోని సంతానం లేని దంపతులకు బంధువుల పిల్లాడని నమ్మించి విక్రయించారు. విషయం బయటపడడంతో ఆ దంపతులు పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తులో రాజరాజేశ్వరిపేటకు చెందిన గంటా మేరీ, పెడమర్తి కనకమ్మ, అయ్యప్పనగర్‌కు చెందిన గండికోట గురమ్మలను పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్తుకాగితాలు ఏరుకుంటూ, కూలి పనులు చేసుకునే ఈ నిందితులు త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ దారుణాలకు పాల్పడ్డారని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. మరొక బాలుడిని తల్లికి అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది.













.webp&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!