

టెలికాం రంగానికి 2 గిగావాట్ అవర్ (GWh) సామర్థ్యం గల లిథియం అయాన్ స్టోరేజ్ సొల్యూషన్లు అందించే లక్ష్యంతో అమరరాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ ముందుకు సాగుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 50 వేల సైట్లలో మొత్తం 1 గిగావాట్ అవర్ సొల్యూషన్ల సరఫరా పూర్తి చేసి కంపెనీ కీలక మైలురాయిని చేరుకుంది. ఇంధన నిల్వ రంగంలో యూపీఎస్, డేటా సెంటర్లు, కొత్త అప్లికేషన్ల కోసం లిథియం అయాన్ సొల్యూషన్ల విభాగంలో ఇది ముఖ్యమైన పురోగతిగా కంపెనీ పేర్కొంది.
కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విక్రమ్ గౌరినేని మాట్లాడుతూ, ఇప్పుడు తదుపరి లక్ష్యంగా 2 గిగావాట్ అవర్ సామర్థ్యాన్ని చేరుకోవడంపై దృష్టి పెట్టామని తెలిపారు. ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (ESS) కోసం పూర్తి ఇంటిగ్రేటెడ్ ప్యాక్స్, కంటైనర్ల తయారీకి తెలంగాణలోని దివిటిపల్లి ఫ్యాక్టరీలో కొత్త యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ యూనిట్లో లిథియం అయాన్ బ్యాటరీల తయారీతో పాటు పరిశోధన వసతుల అభివృద్ధికి పదేళ్లలో రూ.9,500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది.
ఇప్పటి వరకు 1 గిగావాట్ అవర్ మైలురాయిని చేరేందుకు రెండు నుంచి మూడు సంవత్సరాలు పట్టిందని, అయితే ఈ ఏడాదిలోనే దాన్ని రెట్టింపు చేసి 2 గిగావాట్ అవర్ దశను అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన వెల్లడించారు. తెలంగాణలో ఏర్పాటు చేయనున్న కొత్త యూనిట్‌కు వచ్చే వారంలో శంకుస్థాపన జరగనుందని, ఈ ఏడాది నవంబర్ చివరి నాటికి ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!