

తెలంగాణ భవన్‌లో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా నిర్వహించిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కే.టి. రామారావు (కేటీఆర్) పార్టీ నేతలతో కలిసి పాల్గొన్నారు. సంప్రదాయ పూజల అనంతరం ప్రముఖ పండితులు మృత్యుంజయ శర్మ, ఫణీంద్ర శర్మ పంచాంగ శ్రవణం నిర్వహించి ఈ సంవత్సరానికి సంబంధించిన విశేషాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాలన, ప్రజా సమస్యలు, భవిష్యత్తు పరిస్థితులపై తమ అభిప్రాయాలను తెలిపారు.
ప్రభుత్వ వైఫల్యాలు కొనసాగితే ప్రజల్లో అసంతృప్తి పెరిగి ప్రతిపక్షానికి బలం చేకూరే అవకాశం ఉందని పండితులు పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో లోపాలు ఉంటే ప్రత్యామ్నాయ శక్తిగా ప్రతిపక్షం ఎదుగుతుందని స్పష్టం చేశారు. అలాగే విద్యా విధాన మార్పులు విద్యార్థులకు నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉందని, యువత పక్కదారి పడే అవకాశంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే నిరుద్యోగం పెరిగే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు.

ఇక వ్యవసాయ రంగంలో మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండే సూచనలు ఉన్నాయని తెలిపారు. దేశం వాణిజ్య రంగంలో పురోగతి సాధించి ప్రపంచవ్యాప్తంగా మరింత గౌరవం పొందుతుందని పేర్కొన్నారు. అయితే బంగారం, వెండి, ధాన్యాల ధరలు పెరిగే అవకాశం ఉండగా, కొన్ని ప్రమాదాలు పెరిగే సూచనలు ఉన్నాయని హెచ్చరించారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు మహిళలకు ఉన్నత స్థానాల్లో మరిన్ని అవకాశాలు లభించే అవకాశముందని పండితులు అభిప్రాయపడ్డారు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!