.webp&w=3840&q=75)

వెండితెరపైనే కాకుండా నిజజీవితంలోనూ తాను ‘అందరివాడు’ అని మెగాస్టార్ చిరంజీవి మరోసారి నిరూపించారు. దశాబ్దాలుగా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ సేవల ద్వారా లక్షలాది మందికి ప్రాణదాతగా నిలిచిన ఆయన, ఇప్పుడు విద్య ద్వారా పేదరికాన్ని ఎదుర్కొనే దిశగా ముందడుగు వేస్తున్నారు. ఉగాది సందర్భంగా ఆయన సూచించిన ‘ఉచిత విద్యా ప్రాజెక్ట్’ విషయం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఒక ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చిరంజీవి ఈ అంశంపై తన ఆలోచనలను వెల్లడించారు.
“నేను రక్తదానాన్ని జీవన భాగంగా తీసుకున్నప్పుడు, నన్ను స్ఫూర్తిగా తీసుకుని తమిళ నటుడు సూర్య ‘అగరం ఫౌండేషన్’ను ప్రారంభించారు. ఆ సంస్థ ద్వారా ఆయన వందలాది పేద విద్యార్థులకు విద్య అందిస్తున్నారు. ఇప్పుడు అదే సూర్య నుంచి నేను ప్రేరణ పొందుతున్నాను. పేద ప్రజలకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించే దిశగా అడుగులు వేస్తున్నాను” అని చిరంజీవి తెలిపారు.
ఈ ఉచిత విద్యా కార్యక్రమాన్ని కేవలం తెలుగు రాష్ట్రాలకు పరిమితం చేయకుండా, అవసరం ఉన్న ప్రతి ప్రాంతంలో అమలు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. రక్తదానం ప్రాణాలను కాపాడితే, విద్య ఒక తరం భవిష్యత్తును మార్చగలదని ఆయన విశ్వసిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన రూపకల్పన, విధివిధానాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపారు. ‘అగరం’ తరహాలో ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం ద్వారా వేలాది పేద విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకురావాలని ఆయన సంకల్పించారు. ఈ సామాజిక సేవకు ఇప్పటికే ప్రజల నుంచి విశేష ప్రశంసలు లభిస్తున్నాయి.










.webp&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!