

కొత్వాలగూడలో నిర్మించిన ఎకో హిల్ పార్క్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బుడ్వెల్ లేఅవుట్‌తో కలిపే రేడియల్ రోడ్–2 ఇంటర్‌చేంజ్‌కు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి శాసనమండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మల్లు రవి, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, మల్ రెడ్డి రంగా రెడ్డి, సీఎం మాజీ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం సీఎం ఎకో హిల్ పార్క్‌ను సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన బర్డ్స్ ఏవియరీని కూడా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగర అభివృద్ధిపై తన అభిప్రాయాలను వెల్లడించారు. సినిమా షూటింగ్‌ల కోసం చాలా మంది విదేశాలకు వెళ్తున్నారని, కానీ హైదరాబాద్ కంటే సుందరమైన నగరం దేశంలో లేదని పేర్కొన్నారు. మంచి ప్రభుత్వం ఉంటే హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేయవచ్చని తెలిపారు. గతంలో చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో కృష్ణా, గోదావరి నదుల నుంచి నగరానికి నీటిని తీసుకువచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అలాగే నాటి నిజాం నవాబు ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సలహాలతో మూసి నదిపై వరదల నివారణ చర్యలు చేపట్టారని అన్నారు.
హైదరాబాద్‌లో ఉస్మానియా ఆసుపత్రి, గోల్కొండ కోట, అసెంబ్లీ వంటి చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయని, కానీ ప్రస్తుతం నగరం ఆక్రమణలు మరియు చెత్త సమస్యలతో బాధపడుతోందని సీఎం పేర్కొన్నారు. నగరాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, శంషాబాద్‌ను భవిష్యత్తులో బుల్లెట్ ట్రైన్ హబ్‌గా అభివృద్ధి చేసి బెంగళూరు, అమరావతి, చెన్నై నగరాలకు అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. కొత్త ప్రాజెక్టుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని, నిర్వాసితులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే మూసి నది పరివాహక ప్రాంతంలో మూసి రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసి నది పక్కన నైట్ ఎకానమీ అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!