

మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ (APMIP) అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో నిలవడం పట్ల ముఖ్యమంత్రి N. చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాలను మించి 1,26,057 హెక్టార్లను సూక్ష్మ సేద్యం పరిధిలోకి తీసుకువచ్చిన అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు. ఏపీ తర్వాత సుమారు 1.05 లక్షల హెక్టార్లతో గుజరాత్ రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు.
ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసి, రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన అధికారుల కృషిని సీఎం ప్రశంసించారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న 1,08,143 మంది రైతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆధునిక సాగు పద్ధతులతో మెరుగైన దిగుబడులు, అధిక లాభాలు సాధించాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా డ్రిప్, స్ప్రింక్లర్ విధానాలను అనుసరించడం ద్వారా నీటి పొదుపుతో పాటు సాగు ఖర్చులు తగ్గి రైతులు ఆర్థికంగా బలపడతారని అన్నారు.
టమాటా, ఆయిల్ పామ్, మిర్చి నుంచి పప్పు ధాన్యాల వరకు వివిధ పంటలను సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ ప్రాజెక్టు కింద రైతులకు రూ.1030 కోట్ల సబ్సిడీ అందించామని వెల్లడించారు. మైక్రో ఇరిగేషన్‌ను మరింత విస్తరించేందుకు అధికారులు కృషి చేయాలని, అర్హులైన ప్రతి రైతుకూ సకాలంలో సబ్సిడీ అందేలా చూడాలని సూచించారు. భవిష్యత్తులో మరిన్ని వేల హెక్టార్లను సాగులోకి తీసుకువచ్చి, ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం తెలిపారు.











.jpg&w=3840&q=75)

.jpg&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!