

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2026 ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై పంజాబ్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 210 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి పంజాబ్ జట్టు విజేతగా నిలిచింది.
ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. యువ ఆటగాడు ఆయుష్ మాత్రే 43 బంతుల్లో 73 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (28), సర్ఫరాజ్ ఖాన్ (32), శివమ్ దూబే (45 నాటౌట్) కూడా కీలకంగా రాణించారు. అయితే సంజు శాంసన్ (7) నిరాశపరిచాడు. పంజాబ్ బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాఖ్ రెండు వికెట్లు తీసి ప్రభావం చూపాడు.
210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. ప్రియాంశ్ ఆర్య కేవలం 11 బంతుల్లో 39 పరుగులు చేసి దూకుడుగా ఆడగా, ప్రభ్‌సిమ్రన్ సింగ్ 43 పరుగులతో జట్టుకు బలం చేకూర్చాడు. అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 29 బంతుల్లో 50 పరుగులు చేసి జట్టును విజయానికి దగ్గర చేశాడు. చివర్లో కూపర్ కన్నోల్లీ 36 పరుగులతో వేగంగా ఆడటంతో పంజాబ్ 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ గెలుపుతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకోగా, చెన్నై సూపర్ కింగ్స్ స్వస్థలంలో ఓటమిని చవిచూసింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!