

ఏఐ ద్వారా రూపొందుతున్న కంటెంట్‌ను గుర్తించేందుకు ప్రపంచవ్యాప్తంగా పారదర్శకతపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆంథ్రోపిక్ కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్ క్లాడ్ ఏఐ మోడళ్ల ద్వారా రూపొందించే 200 టోకెన్లకు, అంటే సుమారు 150 పదాలకు మించిన టెక్స్ట్‌కు మనుషులకు కనిపించని మెషీన్-రీడబుల్ వాటర్‌మార్క్‌ను జోడించనున్నట్లు తెలిపింది. కంటెంట్‌ను కాపీ చేసి వేరే చోట పేస్ట్ చేసినా, కొంత మేర ఎడిట్ చేసినా వాటర్‌మార్క్ గుర్తించగలిగేలా రూపొందిస్తున్నట్లు పేర్కొంది. ఈ విధానంలో కనిపించని యూనికోడ్ అక్షరాలను దాచడం ఉండదని, మోడల్ వేగం లేదా టోకెన్ వినియోగంపై అదనపు ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. అలాగే వాటర్‌మార్క్‌లో యూజర్, సంస్థ లేదా చాట్ సెషన్‌కు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని పొందుపరచబోమని తెలిపింది.
గూగుల్ డీప్‌మైండ్ అభివృద్ధి చేసిన SynthID-Text పరిశోధన ఆధారంగా ఆంథ్రోపిక్ ఈ సాంకేతికతను రూపొందిస్తోంది. మోడల్ టోకెన్లను ఎంచుకునే విధానంలో స్వల్పంగా ప్రభావం చూపిస్తూ గుర్తించగల గణాంక నమూనాను సృష్టించడం దీని ఉద్దేశం. అంతర్గత పరీక్షల్లో టెక్స్ట్ నాణ్యత, సృజనాత్మకత, చదవడానికి సౌలభ్యంపై గణనీయమైన ప్రభావం కనిపించలేదని కంపెనీ తెలిపింది. అయితే చిన్న టెక్స్ట్‌లు, అత్యంత వాస్తవాధారిత కంటెంట్, ప్రూఫ్‌రీడింగ్, కోడింగ్‌లో వాటర్‌మార్కింగ్ పరిమితంగా పనిచేసే అవకాశం ఉంది. క్లాడ్ కంటెంట్‌ను గుర్తించేందుకు ప్రత్యేక డిటెక్షన్ APIని కూడా త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆంథ్రోపిక్ వెల్లడించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!