

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బెంగళూరుకు చేరుకున్నారు. యలహంక ప్యాలెస్‌లోకి ఆమె ప్రవేశించకుండా అడ్డుకునేందుకు పోలీసులు విమానాశ్రయంతో పాటు ప్యాలెస్ పరిసరాల్లో భారీగా మోహరించారు. విచారణ పూర్తయ్యే వరకు షర్మిల, ఆమెకు సంబంధించిన వ్యక్తులు ప్యాలెస్‌లోకి వెళ్లకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేశారు.
పెళ్లి పనుల నిమిత్తం మూడు రోజుల క్రితం షర్మిల యలహంక ప్యాలెస్‌కు వెళ్లేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె ప్రవేశాన్ని అడ్డుకోవాలని కోరుతూ జగన్ సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి భీమిశెట్టి రమేష్‌బాబు పిటిషన్ దాఖలు చేశారు. సంస్థ తరఫు న్యాయవాది సుధీర్ మేడమ్మయ్య వాదిస్తూ.. వైఎస్ భారతి తల్లి ఇ.సి. సుగుణమ్మ 2007లో 20 ఏళ్ల కాలానికి ప్యాలెస్‌ను తమ సంస్థకు లీజుకు ఇచ్చారని, అక్కడి అభివృద్ధి పనులకు భారీగా ఖర్చు చేశామని తెలిపారు. 2026 ఆగస్టులో సుగుణమ్మ గిఫ్ట్ డీడ్ ద్వారా ఆస్తిని భారతి, ఆమె మనుమరాళ్లకు బదిలీ చేశారని పేర్కొన్నారు. షర్మిల, ఆమెకు సంబంధించిన వ్యక్తుల జోక్యంతో ప్యాలెస్‌లోని నిర్మాణాలు, పండ్ల తోటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయాధికారి షర్మిల, ఆమె అనుచరులను ప్యాలెస్‌లోకి ప్రవేశించకుండా నిలువరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!