

గణిత శాస్త్రంలో దశాబ్దాలుగా పరిష్కారం కాని రీమన్ హైపోథీసిస్‌కు ఆంథ్రోపిక్ సంస్థకు చెందిన క్లాడ్ ఏఐ సాయంతో పరిష్కారం కనుగొన్నట్లు ఆ సంస్థలో పనిచేస్తున్న గణిత శాస్త్రవేత్త లెవెంట్ అల్పోజ్ ప్రకటించారు. ఈ సమస్యకు సంబంధించిన నాలుగు పేజీల వివరణను శుక్రవారం తన వెబ్‌సైట్‌లో ప్రచురించారు. గత కొన్ని నెలలుగా తాను, క్లాడ్ కలిసి ఈ సమస్యపై విస్తృతంగా పనిచేశామని, ఈసారి క్లాడ్ తనకంటే ముందే పరిష్కారానికి చేరుకుందని అల్పోజ్ పేర్కొన్నారు. 1859లో ప్రతిపాదించిన రీమన్ హైపోథీసిస్.. ప్రధాన సంఖ్యలు పెరుగుతున్న కొద్దీ వాటి పంపిణీ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి సంబంధించిన కీలకమైన గణిత సిద్ధాంతం. స్వచ్ఛ గణితశాస్త్రంలో అత్యంత క్లిష్టమైన, ఇప్పటివరకు పరిష్కారం కాని సమస్యల్లో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది.
ఈ సమస్యను పరిష్కరించిన వారికి మిలియన్ డాలర్ల బహుమతి ప్రకటిస్తూ క్లే మ్యాథమెటిక్స్ ఇన్‌స్టిట్యూట్ గతంలో ముందుకొచ్చింది. అయితే అల్పోజ్ ప్రకటనపై ఆంథ్రోపిక్ సంస్థ వెంటనే స్పందించలేదు. క్లే మ్యాథమెటిక్స్ ఇన్‌స్టిట్యూట్ సైతం ఈ సమస్య పరిష్కారమైనట్లు అధికారికంగా అంగీకరించలేదు. రీమన్ హైపోథీసిస్‌ను ఇప్పటికీ పరిష్కారం కాని సమస్యగానే పరిగణిస్తున్నట్లు తెలిపింది. ఈ వాదన నిజమో కాదో నిర్ధారించడానికి సమయం పడుతుందని సంస్థ అధ్యక్షుడు మార్టిన్ బ్రిడ్జ్‌సన్ స్పష్టం చేశారు. అల్పోజ్ ప్రకటన చారిత్రక ప్రాధాన్యం కలిగినదని ఆయన పేర్కొన్నప్పటికీ, అధికారిక నిర్ధారణ వచ్చే వరకు ఈ సమస్య పరిష్కారమైనట్లు భావించలేం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!