

సైబర్ నేరగాళ్లు కొత్త తరహా దాడులకు పాల్పడుతున్నారు. భారీ స్థాయిలో ఈమెయిల్ బాంబింగ్ దాడులు చేస్తూ, అనంతరం ఐటీ హెల్ప్‌డెస్క్ సిబ్బందిగా నటించి యూజర్ల ఖాతాలను హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇన్ఫోసెక్యూరిటీ మ్యాగజైన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫోర్ట్రా ఇంటెలిజెన్స్ అండ్ రీసెర్చ్ నిపుణులు ఈ సైబర్ దాడులపై నిఘా పెట్టారు. ఇందులో భాగంగా ఆటోమేటెడ్ న్యూస్‌లెటర్లు, వెబ్‌సైట్ రిజిస్ట్రేషన్ సందేశాలను లక్ష్యంగా చేసుకున్న వారి ఈమెయిల్ చిరునామాలకు భారీగా పంపిస్తున్నారు. ఇలా ఒక్కసారిగా వేల సంఖ్యలో సందేశాలు రావడంతో వినియోగదారుల ఇన్‌బాక్స్‌లు నిండిపోతున్నాయి.
ఈ దాడికి పాల్పడేందుకు నేరగాళ్లకు బాధితుల ఈమెయిల్ ఖాతాలోకి ముందస్తుగా ప్రవేశించాల్సిన అవసరం లేదు. ఆటోమేటెడ్ ఏజెంట్ల సాయంతో వివిధ వెబ్‌సైట్లను పరిశీలించి, అక్కడి సైన్‌అప్ ఫారమ్‌లలో లక్ష్యంగా చేసుకున్న వ్యక్తుల ఈమెయిల్ చిరునామాలను నమోదు చేస్తున్నారు. దీంతో న్యూస్‌లెటర్లు, రిజిస్ట్రేషన్ సందేశాలు పెద్ద సంఖ్యలో చేరుతున్నాయి. సాధారణ ఈమెయిళ్లు, భద్రతా హెచ్చరికలు, చెల్లింపులకు సంబంధించిన నోటిఫికేషన్లు ఈ సందేశాల మధ్య కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది. పరిశోధకుల పరిశీలనలో ఒక్కో దాడి సమయంలో 10 వేల వరకు ఈమెయిళ్లు వచ్చినట్లు గుర్తించారు. ఈ సందేశాలను పంపేందుకు Mailchimp, Amazon SES, SendGrid వంటి సేవలను ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు.
ఈమెయిల్ బాంబింగ్ జరుగుతున్న సమయంలోనే సైబర్ నేరగాళ్లు మైక్రోసాఫ్ట్ టీమ్స్ ద్వారా వాయిస్ ఫిషింగ్ (విషింగ్) కాల్స్ చేస్తున్నారు. సంస్థలో పనిచేసే ఐటీ సిబ్బందిగా పరిచయం చేసుకుంటూ, ఈమెయిళ్ల సమస్యను పరిష్కరిస్తామని నమ్మిస్తున్నారు. అయితే అసలు లక్ష్యం బాధితుల ఖాతాలు లేదా కంప్యూటర్ వ్యవస్థలను తమ ఆధీనంలోకి తీసుకోవడమే. ఒక్కో సబ్‌స్క్రిప్షన్ ఈమెయిల్ చట్టబద్ధమైన సేవల నుంచే రావడంతో ఈ దాడులను గుర్తించడం కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో సంస్థలు తమ సాధారణ ఈమెయిల్ ట్రాఫిక్‌ను పర్యవేక్షించాలని, అకస్మాత్తుగా వివిధ పంపినవారి నుంచి భారీగా సందేశాలు వస్తే అప్రమత్తమై పరిశీలించాలని ఫోర్ట్రా సూచించింది. అవసరమైతే ఈమెయిల్ డెలివరీ సేవలను అందించే సంస్థలతో సమన్వయం చేసుకుని తాత్కాలికంగా సబ్‌స్క్రిప్షన్‌లను నిలిపివేయాలని తెలిపింది. ఈ దాడుల వెనుక ఎవరున్నారో ఇంకా గుర్తించనప్పటికీ, ఏఐ ఆధారిత ఆటోమేషన్‌తో పాటు సోషల్ ఇంజినీరింగ్‌ను ఉపయోగించడం సైబర్ ముప్పులు కొత్త రూపం దాల్చుతున్నాయని స్పష్టం చేస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!