

టెక్ దిగ్గజం యాపిల్ భారత్‌లో ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్లతో నవీకరించిన యాపిల్ మ్యాప్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారతీయ రహదారులు, స్థానిక పరిస్థితులు, భాషలకు అనుగుణంగా ప్రత్యేక సదుపాయాలను ఇందులో జోడించింది. వేగవంతమైన నేవిగేషన్, హై-రిజల్యూషన్ వీక్షణలతో పాటు దేశవ్యాప్తంగా రోడ్లు, భవనాలు, పార్కులు, షాపింగ్ మాల్స్‌కు సంబంధించిన వివరాలను పొందుపరిచింది. ప్రముఖ చారిత్రక కట్టడాలు, భవనాలు, ప్రార్థనా మందిరాలు సహా 300కు పైగా ల్యాండ్‌మార్క్‌లను 3డీ రూపంలో వీక్షించే అవకాశం కల్పించింది. 360 డిగ్రీల వీక్షణ సదుపాయంతో ఒక ప్రాంతానికి వెళ్లకముందే అక్కడి వీధులు, పరిసరాలను పరిశీలించవచ్చు.
భారతీయ రహదారులపై స్పష్టమైన చిరునామాలు, రోడ్ల పేర్లు లేని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని స్థానిక గుర్తుల ఆధారంగా వాయిస్ నేవిగేషన్ సూచనలను రూపొందించింది. కేవలం మలుపుల వివరాలే కాకుండా, పెట్రోల్ బంకు లేదా ట్రాఫిక్ సిగ్నల్ వంటి గుర్తులను ప్రస్తావిస్తూ మార్గనిర్దేశం చేస్తుంది. ఫ్లైఓవర్లు, మలుపుల వద్ద సరైన లేన్‌ను ఎంచుకునేందుకు లేన్ గైడెన్స్ సదుపాయం కూడా ఉంది. ఇంగ్లిష్, హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ, పంజాబీ, ఒడియా, ఉర్దూ భాషల్లోనూ మ్యాప్స్‌ను ఉపయోగించుకోవచ్చు. హైదరాబాద్ సహా పలు ప్రధాన నగరాల్లో మెట్రో, బస్సు, రైలు ప్రయాణాలకు సంబంధించిన రూట్ ప్లానింగ్, సమయాల వివరాలను అందిస్తుంది. ఈ ఫీచర్లు ఐఓఎస్, ఐప్యాడ్‌ఓఎస్, వాచ్‌ఓఎస్, మ్యాక్‌ఓఎస్ 27.2 లేదా ఆపై వెర్షన్లలో పనిచేసే యాపిల్ పరికరాలకు అందుబాటులో ఉన్నట్లు సమాచారం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!