

ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇస్తున్న తీరు కనిపిస్తోందని, అదే శ్రద్ధ విశాఖ ఉక్కు కర్మాగారానికి ఎందుకు చూపడం లేదని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. మిత్తల్ స్టీల్ ప్లాంట్ స్థాపనను స్వాగతించినప్పటికీ, ఆ సంస్థకు రూ.25 వేల కోట్ల రాయితీలు ఇవ్వడాన్ని ఆమె తప్పుబట్టారు.
విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన షర్మిల, విశాఖ ఉక్కు కర్మాగారం స్థాపనకు ప్రజలు చేసిన త్యాగాలను గుర్తుచేశారు. 32 మంది ప్రాణాలు అర్పించగా, వేలాది మంది భూములు ఇచ్చారని పేర్కొన్నారు. అయినప్పటికీ, ఇప్పటికీ కర్మాగారానికి సంబంధించిన సమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు.
ప్రైవేటీకరణ భయం ఇంకా కొనసాగుతూనే ఉందని, దాన్ని పూర్తిగా నిలిపివేస్తామని ఎవరూ స్పష్టంగా హామీ ఇవ్వలేదని విమర్శించారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రైవేటీకరణ ఆలోచన మొదలైందని తెలిపారు. సెయిల్‌లో విలీనం చేయాలన్న సూచనలను పట్టించుకోలేదని, అలాగే క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలన్న డిమాండ్‌ను కూడా విస్మరించారని అన్నారు.
విశాఖ ప్లాంట్‌కు అవసరమైన ఐరన్ ఓర్‌ను సరఫరా చేసే బైలదిల్లా గనుల నుంచే మిత్తల్ ప్లాంట్‌కు కూడా సరఫరా చేయడం పై సందేహాలు వ్యక్తం చేశారు. దీనివల్ల విశాఖ ఉక్కు ఉత్పత్తికి అవసరమైన ముడి సరుకు తగ్గే అవకాశం ఉందా అని ప్రశ్నించారు.
ఇక రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. దానిని ‘జోక్ క్యాలెండర్’గా అభివర్ణిస్తూ, లక్షా ఎనభై వేల ఖాళీలు ఉండగా కేవలం 10 వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం అన్యాయమని అన్నారు. గ్రూప్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల వయో పరిమితిని 47 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు.








.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!