

అమెరికా మాజీ కాంగ్రెస్ సభ్యురాలు, రిపబ్లికన్ పార్టీ నాయకురాలు మార్జోరీ టేలర్ గ్రీన్ సంచలన ఆరోపణలు చేశారు. ఇరాన్‌పై అణ్వాయుధాలను ఉపయోగించే అంశంపై అమెరికా ఉన్నతస్థాయి వ్యూహాత్మక సమావేశాల్లో చర్చలు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఎక్స్‌లో చేసిన పోస్టులో.. అణ్వాయుధాల వినియోగానికి సంబంధించిన పరిమితులను తగ్గించే అంశాన్ని ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆరోపించారు. ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా భారీ సంఘర్షణ, ఆర్థిక మాంద్యం, తీవ్రమైన మానవతా సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అయితే ఈ ఆరోపణలకు ఆమె ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు. అమెరికా ప్రభుత్వం లేదా వైట్‌హౌస్ కూడా ఇలాంటి ప్రణాళికపై ఎలాంటి అధికారిక ధ్రువీకరణ ఇవ్వలేదు.
1945లో హిరోషిమా, నాగసాకిపై జరిగిన అణుబాంబు దాడులను గుర్తుచేసిన గ్రీన్.. వాటి దీర్ఘకాలిక ప్రభావాలను ప్రస్తావిస్తూ ఇలాంటి పరిస్థితి మళ్లీ తలెత్తకూడదని అన్నారు. మరోవైపు, ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ ఖతామీ యుద్ధానికి ముగింపు పలికి శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు దౌత్యపరమైన మార్గాలను అనుసరించాలని సూచించారు. ఇదిలా ఉండగా, అమెరికా, ఇజ్రాయెల్ వద్ద అణ్వాయుధాలు ఉన్నంతకాలం ఇరాన్ కూడా అణ్వాయుధాలను సమకూర్చుకుంటుందంటూ సీనియర్ ఇరాన్ కమాండర్ అహ్మద్ వాహిదీ వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ వ్యాఖ్యలకు స్వతంత్ర ధ్రువీకరణ లభించలేదు. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఆ వ్యాఖ్యలను తప్పుగా పేర్కొన్నట్లు నివేదికలు వెల్లడించాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!