

పబ్లిక్ ఎగ్జామినేషన్స్‌లో అక్రమాల నిరోధానికి ఉద్దేశించిన యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. విద్యార్థుల ఆందోళనలను ప్రస్తావించిన ఆయన, కేంద్ర ప్రభుత్వం వారి సమస్యలను సమర్థంగా పరిష్కరించలేదని ఆరోపించారు. శాంతియుతంగా నిరసనలు తెలిపిన విద్యార్థులపై పోలీసుల చర్యలను విమర్శిస్తూ, ప్రస్తుతం విద్యా వ్యవస్థ అధికంగా వాణిజ్యీకరణకు గురైందని పేర్కొన్నారు. అలాగే ఆర్‌ఎస్‌ఎస్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, హోంమంత్రి అమిత్ షాపై కూడా ఆరోపణలు చేయడంతో అధికార పక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఆధారరహితమని బీజేపీ సభ్యులు మండిపడ్డారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, అమిత్ షాపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని, లేకపోతే వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోగా, సభలో కొంతసేపు గందరగోళం నెలకొంది. అనంతరం స్పీకర్ అభ్యంతరకరంగా భావించిన కొన్ని వ్యాఖ్యలను సభా రికార్డుల నుంచి తొలగించారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!