

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం – ఏకే 47’ టీజర్ నెట్టింట సందడి చేస్తోంది. స్వచ్ఛమైన కుటుంబ కథకు ‘ఏకే 47’ అనే టైటిల్‌ను జోడించడంతోనే సినిమాపై ఆసక్తి పెరిగింది. మధ్యతరగతి కుటుంబంలోని సరదా సంఘటనలతో మొదలైన టీజర్‌లో వెంకటేష్ వింటేజ్ కామెడీ, త్రివిక్రమ్ పదునైన పంచ్ డైలాగ్స్, ఊహించని యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. బయటికి ఆదర్శ కుటుంబంలా కనిపించే వారి జీవితాల్లో దాగి ఉన్న అసలు కథేంటనే ఆసక్తిని టీజర్ రేకెత్తించింది. వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది.
నారా రోహిత్, నివేదా పేతురాజ్, సత్య, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ ఎస్ అందించిన నేపథ్య సంగీతం టీజర్‌కు మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. రవి కె. చంద్రన్ ఛాయాగ్రహణం, నవీన్ నూలి ఎడిటింగ్, ఏ.ఎస్. ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల రెండో తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!