

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం త్వరలో ముగిసే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధం 13వ రోజుకు చేరుకోగా అమెరికా–ఇజ్రాయెల్ దళాలు ఇరాన్, లెబనాన్‌లలోని పౌర లక్ష్యాలపై వైమానిక దాడులు చేశాయి. టెహ్రాన్‌లో భద్రతా చెక్పాయింట్లు, బీరుట్‌లోని రమ్లెట్ అల్-బేదా పర్యాటక ప్రాంతం లక్ష్యంగా జరిగిన ఈ దాడుల్లో 21 మంది మృతి చెందగా 32 మంది గాయపడ్డారు. మరోవైపు ఇరాన్, లెబనాన్ ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ప్రతిదాడులు కొనసాగించాయి. లెబనాన్ నుంచి ఇజ్రాయెల్‌పై దాదాపు 200 రాకెట్లు ప్రయోగించగా, ఉత్తర మరియు మధ్య ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇటీవలి దాడుల్లో ఇరాన్‌కు చెందిన అణు కేంద్రాన్ని ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
పర్షియన్ గల్ఫ్‌లో ఇరాక్‌లోని ఖోర్ అల్-జుబైర్ పోర్టు సమీపంలో అమెరికాకు చెందిన నౌకపై ఇరాన్ ఆత్మాహుతి పడవతో దాడి చేయడంతో ఒక భారతీయ నావికుడు మరణించాడు. ఇప్పటివరకు ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోగా మరొకరు గల్లంతయ్యారు. గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగుతాయని, హర్మూజ్ జలసంధిలో నౌకలను అడ్డుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ హెచ్చరించారు. యుద్ధం కారణంగా ఇరాన్, లెబనాన్లలో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. హర్మూజ్ జలసంధిలో రవాణా అంతరాయం కలగడంతో చమురు ధరలు మళ్లీ బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరుకున్నాయి. పరిస్థితులు మరింత విషమిస్తాయని అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!