

పశ్చిమాసియాలో అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం భారతదేశంలో సాధారణ ప్రజల జీవితాలపై పడుతోంది. ఇప్పటికే వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటళ్లు, మెస్‌లు, క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు, హాస్టళ్ల నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గృహ వినియోగ వంటగ్యాస్ ధరలు పెరగడంతో పాటు పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే భయంతో కొందరు వాహనదారులు ముందుగానే ట్యాంకులు నింపుకుంటున్నారు. ఇదే సమయంలో వేసవి వేడి తీవ్రత పెరుగుతున్న తరుణంలో తాగునీటి సీసాల ధరలు కూడా పెరగవచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం దేశంలోని ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మార్కెట్ సుమారు 5 బిలియన్ డాలర్ల విలువ కలిగి ఉంది.
ప్లాస్టిక్ సీసాల తయారీలో కీలకమైన పాలిమర్ ముడివస్తువు ముడి చమురు నుంచి తయారవుతుంది. చమురు ధరలు పెరగడంతో పాలిమర్ ధరలు భారీగా పెరిగాయి. సీసాల తయారీలో ఉపయోగించే ముడి పదార్థం ధర దాదాపు 50 శాతం పెరిగి కిలోకు రూ.170కు చేరింది. సీసాల మూతల ధర ఒక్కోటి రూ.0.45కు పెరిగి రెట్టింపు కంటే ఎక్కువైంది. అలాగే ప్యాకింగ్ బాక్సులు, లేబుల్స్, టేపుల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం పెద్ద కంపెనీలు ఈ అదనపు వ్యయాన్ని భరిస్తున్నప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 2000 బాటిల్ తయారీ సంస్థలు రీసెల్లర్ల ధరలను ఒక్క సీసాకు రూపాయి మేర పెంచాయి. మరో కొన్ని రోజుల్లో వినియోగదారుల స్థాయిలో ధరలు 10 శాతం వరకు పెరిగే అవకాశముందని పరిశ్రమ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!