

ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు నల్గొండ జిల్లా ఆల్వాల్ గ్రామానికి చెందిన దోరెపల్లి చంటి (30)గా గుర్తించారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా అనసూయపై వ్యక్తిగత దూషణలు చేస్తూ, అభ్యంతరకరమైన కంటెంట్‌ను పోస్టు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం, ఈ వేధింపులు డిసెంబర్ 2025 నుండి కొనసాగుతున్నాయి.
అనసూయ ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, టెక్నికల్ ఆధారాలతో నిందితుడిని ట్రాక్ చేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 75, 79, 336(4), 351, 356తో పాటు ఐటీ చట్టం సెక్షన్ 66E (ప్రైవసీ ఉల్లంఘన), 67 (అశ్లీల కంటెంట్ ప్రసారం) కింద కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీలను లేదా ఇతర మహిళలను కించపరిచేలా పోస్టులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఫేక్ అకౌంట్లతో తప్పించుకోవచ్చని భావించే వారికి ఇది గట్టి హెచ్చరికగా నిలిచింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!