
-1773128308.jpg&w=3840&q=75)
తిరుమల శ్రీవారి ఆలయంలోని పరాకామణిలో భారీ స్థాయిలో బంగారం దొంగతనం జరిగిందని ఒక దినపత్రికలో(సాక్షి) ప్రచురితమైన కథనం పూర్తిగా అసత్యమని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. వాస్తవాలను వక్రీకరించి ప్రచురించిన ఆ కథనాన్ని టీటీడీ తీవ్రంగా ఖండించింది.
టీటీడీ వివరాల ప్రకారం, గత ఏడాది జనవరి 11 న పరాకామణిలో విధులు నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది పెంచలయ్య 100 గ్రాముల బంగారు బిస్కెట్‌ను అపహరించేందుకు ప్రయత్నించాడు. అయితే విజిలెన్స్ మరియు భద్రతా సిబ్బంది అప్రమత్తంగా స్పందించి అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ బంగారు బిస్కెట్‌ను ఖాళీగా ఉన్న ఉక్కు హుండీ ట్రాలీలోని పైపు రంధ్రంలో దాచినట్లు సాధారణ తనిఖీల్లో గుర్తించారు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో నమోదై, ఆ ఆధారాలు కోర్టుకు సమర్పించబడ్డాయి.
విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు మేరకు తిరుమల ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 02/2025 కింద భారత న్యాయ సంహిత సెక్షన్ 316(5) ప్రకారం బెయిల్ లేని కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. గత ఏడాది జనవరి 13 న కోర్టులో హాజరు పరచగా అతన్ని జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు. నిందితుడు సుమారు 30 రోజులు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. దర్యాప్తులో ఘటన స్థలంలో 100 గ్రాముల బంగారు బిస్కెట్‌తో పాటు ఇంటి సోదాల్లో 555.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 157 గ్రాముల వెండి వస్తువులు మరియు అదనంగా 76 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖ నగల దుకాణాల్లో బంగారం మార్పిడి చేసిన రసీదులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దర్యాప్తులో భాగంగా 12 మంది సాక్షులను విచారించి, నిందితుడి ఆర్థిక లావాదేవీలు, బ్యాంకుల్లో బంగారం ముట్టజెప్పిన వివరాలు, ఆస్తులు మరియు బినామీ లావాదేవీలను పరిశీలించారు. అన్ని ఆధారాలతో చార్జ్‌షీట్ దాఖలు చేయగా కేసు ప్రస్తుతం కోర్టులో 309/2025 నంబర్‌తో విచారణలో ఉంది. తదుపరి విచారణ వచ్చే నెల 13 న జరగనుంది. పరాకామణి ప్రక్రియలో బహుళస్థాయి భద్రతా వ్యవస్థ, కఠిన నియంత్రణ విధానాలు, సీసీటీవీ పర్యవేక్షణ అమలులో ఉన్నాయని టీటీడీ తెలిపింది. భక్తులు అసత్య ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!