

దక్షిణ ఆఫ్రికా ప్రాంతంలో కుండపోత వర్షాలు విస్తృత విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. మొజాంబిక్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా దేశాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటివరకు వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రానున్న రోజుల్లో వర్షపాతం మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది. మొజాంబిక్‌లో వరదల ప్రభావంతో రెండు లక్షల మందికిపైగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేలాది ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
జింబాబ్వేలో కుండపోత వర్షాల కారణంగా సుమారు 70 మంది మృతి చెందారు. వెయ్యికి పైగా ఇళ్లు కొట్టుకుపోయాయి. పాఠశాలలు, రహదారులు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
దక్షిణాఫ్రికాలో మృతుల సంఖ్య 30 కు చేరింది. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. హెలికాప్టర్ల సహాయంతో వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరదల ప్రభావం ప్రఖ్యాత క్రుగార్ నేషనల్ పార్క్ వరకు విస్తరించింది. అక్కడ చిక్కుకున్న 600 మంది పర్యాటకులు, పార్కు సిబ్బందిని సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి.
లా నినా ప్రభావంతో వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా ఆఫ్రికాలోని ఏడు దేశాలు తీవ్ర వర్షాల బారిన పడుతున్నాయని అమెరికా వాతావరణ హెచ్చరికల వ్యవస్థ వెల్లడించింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!