

తెలుగు చిత్ర పరిశ్రమలో కుటుంబ కథా చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి 75వ జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 43వ చిత్రం “వేదవ్యాస్” మేకింగ్ వీడియోను ఆవిష్కరించారు. ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి సమర్పణలో, కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో పిడుగు విశ్వనాథ్ హీరోగా పరిచయం అవుతుండగా, కొరియన్ నటి జూన్ హ్యూంజీ, మంగోలియన్ నటుడు షరన్ బోల్డ్ సెగ్మెంట్ తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
ఈ వేడుకలో ఎస్వీ కృష్ణారెడ్డికి మరో అరుదైన గౌరవం దక్కింది. తాను దర్శకత్వం వహించిన 42 చిత్రాల్లో 38 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన ఘనతకు గుర్తింపుగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఆయనకు వరల్డ్ రికార్డ్ గుర్తింపు పత్రాన్ని అందజేసింది. మురళీమోహన్, రేలంగి నరసింహారావు, చదలవాడ శ్రీనివాసరావు, దామోదర ప్రసాద్, అశోక్ కుమార్, లయ, శ్రీకాంత్, అలీ, జేడీ చక్రవర్తి, శివాజీరాజా తదితరులు ఎస్వీ కృష్ణారెడ్డి సేవలను కొనియాడారు. తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపిన ఎస్వీ కృష్ణారెడ్డి, “వేదవ్యాస్” చిత్రానికి కూడా ప్రేక్షకుల ఆశీర్వాదం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాత అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని తమ కమ్‌బ్యాక్ ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ, ఎస్వీ కృష్ణారెడ్డి సృజనాత్మకతను మరోసారి చాటిచెప్పే చిత్రంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!