

తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ దేశంలో నెంబర్-1గా నిలిచిందని కేంద్రం కూడా పేర్కొన్నట్లు తెలిపారు. మద్దతు ధర కోసం రూ.16 వేల కోట్లు ఖర్చు చేశామని, చివరి గింజ వరకు మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. యాసంగి సీజన్లో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనా ఉండగా, కేంద్రం 52 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పిందని, కానీ రాష్ట్రం ఇప్పటికే 60 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిందని, తడిసిన ధాన్యం కూడా మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు.
ఇదిలా ఉండగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎరువుల విషయంలో కేంద్రం ఇబ్బందులు కలిగిస్తే ఊరుకోమని హెచ్చరించారు. రైతుల పక్షాన పోరాడతామని, అవసరమైతే కాంగ్రెస్ ఎంపీలతో కలిసి ఆందోళనలు చేపడతామని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. పెరిగిన ఇంధన ధరల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీజేపీ నేతలు యాత్రలు చేస్తున్నారని విమర్శించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!