

ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌ల దృష్ట్యా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 5 నుంచి 22 వరకు జరిగే మ్యాచ్‌ల కోసం సుమారు 2,000 మంది పోలీసు సిబ్బందిని విధుల్లో నియమించినట్లు ఉప్పల్ డీసీపీ సురేష్ తెలిపారు.స్టేడియం పరిసరాల్లో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, సెక్యూరిటీ వింగ్, ఏఆర్, మౌంటెడ్ పోలీస్ విభాగాల నుంచి సిబ్బందిని మోహరించారు. మహిళా ప్రేక్షకుల భద్రత కోసం సివిల్ దుస్తుల్లో షీటీమ్స్ బృందాలను కూడా ఏర్పాటు చేశారు.
స్టేడియం లోపల మరియు బయట కలిపి మొత్తం 430 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని చెప్పారు. స్టేడియంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తామని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల కోసం 5 అంబులెన్స్‌లు, అగ్ని ప్రమాదాల నివారణకు 4 ఫైర్ ఇంజన్లను సిద్ధంగా ఉంచారు. టికెట్ ఉన్నవారే స్టేడియం వద్దకు రావాలని, ఇతరులు రద్దీని పెంచవద్దని పోలీసులు సూచించారు. మ్యాచ్‌లకు వచ్చే ప్రేక్షకుల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలను కేటాయించారు. హబ్సిగూడ వైపు నుంచి వచ్చే వారికి పెంగ్విన్ గ్రౌండ్స్, టీజీఐఏఎల్ఏ ప్రాంగణం, రామాంతపూర్ వైపు నుంచి వచ్చే వారికి డీఎస్ఎల్ ప్రాంతంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు.
ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు మెట్రో రైలు లేదా ఆర్టీసీ బస్సులను వినియోగించాలని సూచించారు. మ్యాచ్ రోజులలో ఉప్పల్ స్టేడియం వైపు భారీ వాహనాలైన లారీలు, ట్రక్కులు, టిప్పర్లు, ప్రైవేట్ బస్సులను అనుమతించరు.
ఘట్కేసర్ నుంచి వచ్చే భారీ వాహనాలను నాగోల్, ఎల్బీనగర్ వైపు మళ్లిస్తారు. ఎల్బీనగర్ నుంచి వచ్చే వాహనాలను నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద మళ్లిస్తారు. తార్నాక, హబ్సిగూడ, రామాంతపూర్ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను నాచారం, చర్లపల్లి వైపు మళ్లిస్తారు. వరంగల్ వైపు వెళ్లే వారు ఓఆర్ఆర్ మార్గాన్ని ఉపయోగించాలని అధికారులు సూచించారు.

.jpg&w=3840&q=75)

.jpg&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!