

దేశీయ ఎగుమతి కంపెనీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కంపెనీలు దిగుమతి చేసుకునే కీలక పెట్రో రసాయన ఉత్పత్తులపై జూన్ నెలాఖరు వరకు దిగుమతి సుంకాలను పూర్తిగా ఎత్తివేసింది. ఈ నిర్ణయంతో ఫార్మా, రసాయనాలు, వస్త్ర, ప్లాస్టిక్, ప్యాకేజింగ్, ఆటోమొబైల్ విడిభాగాల తయారీ రంగాలకు గణనీయమైన లాభం చేకూరనుంది. పశ్చిమాసియా సంక్షోభ ప్రభావం నుంచి దేశీయ ఎగుమతిదారులను రక్షించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ నిర్ణయంతో కేంద్రానికి సుమారు రూ.1,800 కోట్ల పన్ను ఆదాయం కోల్పోయే అవకాశం ఉంది. అలాగే ప్రత్యేక ఆర్థిక మండళ్లలోని ఎగుమతి యూనిట్లు తమ ఉత్పత్తిలో 30 శాతం దేశీయ మార్కెట్లో విక్రయించేందుకు అనుమతించిన తర్వాతే ఈ డ్యూటీ మినహాయింపు ప్రకటించడం గమనార్హం.
ఇక మరోవైపు, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (FTA)ను దుర్వినియోగం చేస్తూ బంగారం, వెండి, ప్లాటినం ఆభరణాల దిగుమతులను పెంచుతున్న వారిపై ప్రభుత్వం కట్టడి చర్యలు చేపట్టింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసి, అవి తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఈ నియంత్రణలు దిగుమతుల పరిమాణాన్ని పట్టించుకోకుండా అన్ని స్థాయిలకు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
భారత్-ఆగ్నేయాసియా దేశాల కూటమి (ASEAN)తో ఉన్న ఎఫ్టీఏ ఒప్పందాన్ని కొంతమంది వ్యాపారులు దుర్వినియోగం చేస్తూ థాయ్లాండ్, ఇండోనేషియా వంటి దేశాల నుంచి నగల రూపంలో తక్కువ ధరకు బంగారం, వెండి, ప్లాటినంను దిగుమతి చేసుకుంటూ భారీగా పన్నులు ఎగవేస్తున్నట్లు గుర్తించారు. ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికే ప్రభుత్వం ఈ కఠిన చర్యలు చేపట్టినట్లు భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!