

అమెరికా రాజకీయాల్లో మరో భారతీయ మహిళ అరుదైన ఘనత సాధించారు. వాషింగ్టన్ డీసీ మేయర్ ఎన్నికల బరిలో నిలిచిన తొలి దక్షిణాసియా మహిళగా రిని సంపత్ చరిత్ర సృష్టించారు. 31 ఏళ్ల రిని సంపత్ తమిళనాడులో జన్మించి చిన్న వయసులోనే అమెరికాకు వలస వెళ్లారు. ఇప్పుడు మేయర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నామినేషన్ అర్హతను సంపాదించడం విశేషంగా మారింది.
డెమొక్రటిక్ పార్టీకి చెందిన రిని సంపత్ ప్రస్తుతం ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆమె ఎన్నికల ప్రచారాన్ని ‘ఫిక్స్ ది బేసిక్స్’, ‘ఒక కొత్త డీసీ’ అనే నినాదాలతో కొనసాగిస్తున్నారు. నగరంలో ప్రాథమిక సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు.
ప్రజల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే సమస్యలైన రోడ్లపై గుంతలు, పెరుగుతున్న ధరలు వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకుంటానని ఆమె స్పష్టం చేశారు. నగర అభివృద్ధి, ప్రజలకు మెరుగైన జీవన వాతావరణం కల్పించడమే తన లక్ష్యమని తెలిపారు.
తమిళనాడులో పుట్టి అమెరికాలో రాజకీయాల్లో ఇంత పెద్ద స్థాయికి ఎదగడం భారతీయులకు గర్వకారణంగా మారింది. రిని సంపత్ పోటీతో అమెరికా రాజకీయాల్లో భారతీయుల ప్రాధాన్యం మరింత పెరుగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!