

గాన గంధర్వుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంకు కేరళలో ఘన గౌరవం దక్కింది. పాలక్కాడ్‌లోని వి.టి. భట్ట తిరిప్పాడ్ కల్చరల్ సెంటర్‌లో 10 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాన్ని ఆయన కుటుంబ సభ్యులు, సంగీత ప్రముఖులు, అభిమానుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఆయన కుమారుడు ఎస్. పి. చరణ్తో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి, గాయకులు మనో, కె. ఎస్. చిత్ర, హరిహరన్, సుజాత మోహన్, విజయ్ యేసుదాస్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా “సంగీత మేఘం” పేరుతో ప్రత్యేక సంగీత కార్యక్రమం నిర్వహించి, తమ గానంతో బాలకు స్వర నివాళి అర్పించారు. ప్రముఖ శిల్పి ఉన్ని కనయ్ ఈ విగ్రహాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. భాషా, ప్రాంతీయ భేదాలు లేకుండా కేరళలో ఈ విగ్రహాన్ని ప్రతిష్టించడం ఆయనకు లభించిన గొప్ప గౌరవంగా సంగీత ప్రియులు అభిప్రాయపడుతున్నారు. 16 భాషల్లో 40 వేలకుపైగా పాటలు పాడి గిన్నిస్ రికార్డు సృష్టించిన ఎస్పీబీ, నటుడు, సంగీత దర్శకుడు, డబ్బింగ్ ఆర్టిస్టుగా విశేష కీర్తి సాధించారు. 2020లో ఆయన మరణించినప్పటికీ, తన గానంతో సంగీత ప్రేమికుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!