

వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాల రంగంలో ఇస్రో మరో కీలక మైలురాయికి చేరువైంది. తన బాహుబలి రాకెట్‌గా ప్రసిద్ధి చెందిన LVM-3 ద్వారా సరికొత్త రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. అమెరికాకు చెందిన కొత్తతరం కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్–2 ను కక్ష్యలోకి చేర్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఈ ప్రయోగాన్ని బుధవారం ఉదయం 8.54 గంటలకు సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన 24 గంటల కౌంట్‌డౌన్ మంగళవారం ఉదయం 8.54 గంటలకు ప్రారంభమైంది. కౌంట్‌డౌన్ పూర్తయిన వెంటనే 6,400 కిలోల బరువున్న బ్లూబర్డ్ ఉపగ్రహాన్ని మోసుకెళ్లే ఎల్వీఎం-3-ఎం6 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.
ప్రయోగం ప్రారంభమైన 15.07 నిమిషాల్లో రాకెట్ మూడు దశలను విజయవంతంగా పూర్తి చేసి, ఉపగ్రహాన్ని లో ఎర్త్ ఆర్బిట్ (LEO) లో ప్రవేశపెట్టనుంది. ఈ వాణిజ్య ప్రయోగం అమెరికాకు చెందిన AST SpaceMobile సంస్థతో కుదిరిన ఒప్పందంలో భాగంగా చేపడుతున్నారు.
భారత భూభాగం నుంచి ఇస్రో రాకెట్ ద్వారా ఇంత భారీ బరువున్న ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చడం ఇదే తొలిసారి. ఈ ప్రయోగం విజయవంతమైతే ఇప్పటివరకు ఉన్న 4,400 కిలోల ఉపగ్రహ ప్రయోగ రికార్డు చెరిపివేయబడనుంది. అందుకే దీనిని ఇస్రో వాణిజ్య ప్రయోగాల్లో మరో చారిత్రక ఘట్టంగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు.
కౌంట్‌డౌన్ సమయంలో రాకెట్‌కు ఇంధన నింపే ప్రక్రియను పూర్తిచేసిన శాస్త్రవేత్తలు, అన్ని దశల పనితీరును నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ ప్రక్రియను ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్, షార్ డైరెక్టర్ ఈఎస్ పద్మకుమార్ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.
LVM-3 రాకెట్ 43.5 మీటర్ల ఎత్తు, సుమారు 640 టన్నుల బరువుతో ఇస్రోలో అత్యంత శక్తివంతమైన రాకెట్‌గా గుర్తింపు పొందింది. జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌తో పాటు లో ఎర్త్ ఆర్బిట్‌కు భారీ పేలోడ్లను మోసుకెళ్లగల సామర్థ్యం దీనికి ఉంది. ఇప్పటివరకు ఈ రాకెట్‌తో నిర్వహించిన ఎనిమిది ప్రయోగాలన్నీ విజయవంతమయ్యాయి. వాటిలో ప్రతిష్ఠాత్మక చంద్రయాన్-3 కూడా ఉంది.
ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ ద్వారా చేపడుతున్న మూడో వాణిజ్య LVM-3 ప్రయోగమిది. గతంలో వన్‌వెబ్ సంస్థకు చెందిన రెండు ఉపగ్రహాలను ఇదే రాకెట్ విజయవంతంగా కక్ష్యలోకి చేర్చింది. ఈసారి అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని మోసుకెళ్తుండటంతో ప్రపంచ దృష్టంతా ఇస్రో పై నిలిచింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!