ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా జాతర నిన్న అర్ధరాత్రి మహాపూజతో ఘనంగా ప్రారంభమైంది. ఆదివాసీ సంప్రదాయ రీతిలో సన్నాయి మోతలు, డోలు వాయిద్యాలు, దివిటీల కాంతుల మధ్య మెస్రం వంశీయులు నాగోబాను గంగాజలంతో అభిషేకిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా, దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు.
నాగోబా జాతర ఆసియాలో రెండో అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి పొందింది. పుష్యమాసంలో నెలవంక కనిపించిన తరువాత మెస్రం వంశీయులు ఈ జాతర ప్రారంభానికి శ్రీకారం చుట్టుతారు. డిసెంబర్ 30న, మెస్రం వంశీయులు కేస్లాపూర్ నుంచి పాదయాత్రగా హస్తినమడుగు చేరుకొని, అక్కడ సేకరించిన పవిత్ర గంగాజలంతో కేస్లాపూర్ చేరారు. ఆ గంగాజలంతో ఆదివారం అర్ధరాత్రి ఆదిశేషుడికి అభిషేకం చేసి మహాపూజలతో జాతరను ప్రారంభించారు.
నాగోబా జాతర మహాపూజతో ప్రారంభమై ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగనుంది. జాతరలో భాగంగా 20వ తేదీకి పెర్సపేన్, బాన్ పేన్ పూజలు, 22వ తేదీకి నాగోబా దర్బార్, 23వ తేదీకి బేతాల్ పూజ మరియు మండగాజాలింగ్ పూజలతో ముగింపు కార్యక్రమాలు ఉంటాయి. ఈ జాతర కోసం తెలుగు రాష్ట్రాల వెంట ఉన్న సరిహద్దు రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశముంది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా, జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!