

మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేయడం, అలాగే 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. ఈ బిల్లు ఆమోదం పొందేందుకు అవసరమైన మూడింట రెండొంతుల మెజార్టీ రాకపోవడంతో అది తిరస్కరణకు గురైంది. లోక్‌సభలో మొత్తం 528 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనగా, అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి 358 ఓట్లు అవసరం కాగా, అవసరమైన మెజార్టీ రాకపోవడంతో బిల్లు నిలిచిపోయింది.
ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ, మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చే కుట్రను ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని అన్నారు. ఇది అసలు మహిళా బిల్లు కాదని, దేశ ప్రయోజనాలకు విరుద్ధమైన చర్య అని విమర్శించారు. 2023 మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేసి, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో అనుసంధానం చేయకూడదని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా డీలిమిటేషన్‌కు సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తే మద్దతిస్తామని స్పష్టం చేశాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!