

ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు నిర్వహిస్తున్న విద్యాసంస్థల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ, మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించేందుకు బయల్దేరిన విద్యార్థి సంఘం నాయకులను కిడ్నాప్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి సహచర విద్యార్థి సంఘం నాయకులు వెంటనే తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విషయం జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు దృష్టికి వెళ్లడంతో, ఆయన ఆదేశాల మేరకు ఏఎస్పీ రవి మనోహరాచారి నేతృత్వంలో ప్రత్యేక పోలీస్ బృందాలు ఏర్పాటు చేశారు.
పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, నారావారిపల్లి సమీపంలోని భీమవరం వద్ద కిడ్నాపర్ల వాహనాన్ని అడ్డుకున్నారు. కిడ్నాప్‌కు గురైన విద్యార్థి సంఘం నాయకులను సురక్షితంగా విడిపించి, తిరుచానూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అదే సమయంలో కిడ్నాప్‌కు పాల్పడిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి, వారి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కిడ్నాప్ చేసిన వారంతా మోహన్ బాబు కాలేజీకి చెందిన బౌన్సర్లుగా పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనలో కిడ్నాప్‌కు పాల్పడిన వారితో పాటు, చేయించిన వారిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు అధికారులను ఆదేశించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిని ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు. కిడ్నాప్‌కు గురైన వారిలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్‌తో పాటు నవీన్, వినోద్ ఉన్నారు. ఈ ఘటనపై తిరుచానూరు పీఎస్‌లో ఎంబీయూ యాజమాన్యంపై కేసు నమోదు కాగా, మోహన్ బాబు, విష్ణు మరియు పీఆర్వో సతీష్‌లపై కేసులు నమోదయ్యాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!