

హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ రోడ్డులోని ఫర్నిచర్ మాల్లో జరిగిన భారీ అగ్నిప్రమాదం అత్యంత విషాదకరమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు అమాయకులు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
ఈ ప్రమాదంలో మృతి చెందిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందజేస్తామని మంత్రి ప్రకటించారు. ఈ మేరకు తక్షణ చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరి చందనకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. సహాయక చర్యల్లో ఎలాంటి జాప్యం లేకుండా బాధిత కుటుంబాలకు సహాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ప్రాథమిక విచారణలో షాపు యజమాని నిర్లక్ష్యం కారణంగానే అగ్నిప్రమాదం సంభవించినట్లు తేలిందని మంత్రి తెలిపారు. సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అగ్నిమాపక నిబంధనలు, భద్రతా ప్రమాణాల అమలుపై కఠిన నియంత్రణ చర్యలు తీసుకుంటామని తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!